• YSRCP DMW, Vuyyuru Town

పథకాల పేరు ప్రచారాల హోరు


పేరు తెచ్చుకోవడం, పేరు పడటం అనేవి సహజంగా ప్రతి మనిషీ కోరుకునే లక్షణాలే. కానీ చంద్రబాబుకు ఈ కీర్తి కండూతి (సింపుల్ గా దురద అనొచ్చు) మహా ఎక్కువ. కళ్లకి పచ్చరంగు, చెవులకు తన పేరు తప్ప మరోటి కనిపించినా, వినిపించినా తట్టుకోలేని స్థితికి చేరుకున్నారు చంద్రబాబు. అందుకే ప్రతి పథకానికీ, పర్యటనకి, పనికి, పనికి మాలినదానికీ అన్నిటికీ తనపేరే పెట్టేసి, తన రంగే పూసేసి జబ్బలు చరుచుకుంటున్నారు.


సాధారణంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నవారు, గొప్పవారుగా పేరు గడించి మరణించిన వారి పేర్లను పథకాలకు పెడుతుంటారు. ఇది వారి జ్ఞాపకార్థంగా ఉండాలని మిగితా వారు భావిస్తారు. కానీ బాబు రూటే సపరేటు. బతికున్న తాను, తనకు తానే అన్నిటికీ తన పేరు పెట్టేసుకుంటున్నారు. రేపు ఆయన అధికారంలో లేకపోయినా తన పేరు మాత్రం చిరస్థాయిగా ఉండిపోవాలన్న ఆయన కోరికలో తప్పులేదు. కానీ ఊరూరా తన పేరు రాసేసినంత మాత్రాన జనాల గుండెల్లో తాను ఉండిపోడన్న సంగతి చంద్రబాబు ఎప్పటికైనా గుర్తిస్తాడా? అంటే అనుమానమే. 


వైయస్ రాజశేఖర్ రెడ్డిగారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. 108, 104, ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీయంబర్సుమెంట్ ఇలా ఎన్నో పథకాలను ఆరంభించినా ఆయన ఎక్కడా తన పేరు పెట్టుకోలేదు. ఇమేజ్ అనేది కల్పించుకుంటే వచ్చేది కాదని వైయస్ఆర్ గారికి బాగా తెలుసు. అందుకే ఆయన మరణించిన తర్వాత ప్రజలు స్వచ్ఛందంగా ఆ నేత విగ్రహాలను వాడవాడలా ప్రతిష్ఠించుకున్నారు. అంతకు మించి గుండెల్లో పదిలంగా దాచుకున్నారు. ప్రజలకు మేలు చేయడాన్ని మించిన పేరు తెచ్చే పని ఇంకేం ఉంటుంది. అందుకు వైయస్సార్ జీవితమే ఒక ఉదాహరణ. 


కానీ బాబు విషయం అలా కాదు. ప్రజలకు ఒక్క మేలూ జరగదు. పథకాల లిస్టు మాత్రం పోలవరం లెక్కలా అంత పొడవున ఉంటుంది. ఒక్కసారి ఆ లిస్టును చూస్తే...

డ్వాక్రా రుణమాఫీకి బాబు పెట్టిన పేరు చంద్రన్న  చేయూత. ఇంత వరకూ మహిళా డ్వాక్రా రుణాలు తీరిందే లేదు. 


చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ కానుకలు  ప్రతి పండుగకు, ప్రతి మతానికీ చెందిన వారికి నిత్యావసరాలను చౌక డిపోల్లో  ఈ పథకం ద్వారా అందించిన సరుకులు నాసిరకంగా ఉన్నాయని పుచ్చుకున్న వాళ్లంతా బాబును దుమ్మెత్తి పోసారు. నిజం చెప్పాలంటే చంద్రబాబు కంటే ముందే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ ఈ పథకం ఉంది. కానీ బాబు అందులోని సగం సరుకులు తగ్గించి తన పేరుతో పథకాన్నీ రీమేక్ చేసారు. 

వ్యవసాయ భూములకు భూసార పరీక్షలు, రైతులకు అవగాహనా కార్యక్రమాలు, ఆదర్శరైతులకు పురస్కారాలు ఇవన్నీ కూడా చంద్రబాబు పేరుమీదే. చంద్రన్న రైతు క్షేత్రం, చంద్రన్న ఉత్తమ పురస్కారాలు, చంద్రన్న భూసార పరిరక్షణా పథకం ఇలా తన పేరుమీద నడిపిన ఆ పథకాలు, యాత్రలన్నీ ఏ ఫలితాలనూ ఇవ్వలేదు. 


చంద్రన్న సంక్షేమ బాట పేరుతొ పథకాల గురించి ప్రచారం చేసారు. ప్రజలకు అందని పథకాలకు ప్రచారాలు చేస్తే మాత్రం ప్రయోజనం ఏముంటుంది..? 

వర్గాల వారీగా ఓటు బ్యాంకు కోసం ప్రభుత్వ పథకాలనే తన సొంత పథకాల్లా పేర్లు పెట్టుకుని ప్రచారం చేసారు చంద్రబాబు. చంద్రన్న దళితబాట, చంద్రన్న బిసి స్వయంఉపాధి ఉత్సవాలు, చంద్రన్న స్వయం ఉపాధి కాపు రుణమేళా, చంద్రన్న కాపు భవన్, చెంచుల కోసం చంద్రన్న ఇలాంటివే. 


ఇక చంద్రన్న సంచార చికిత్సాలయాలంటూ మొదలుపెట్టిన మొబైల్ హెల్త్ సర్వీసులు రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన 108కి మార్చి పెట్టిన పేరే. చంద్రన్న ఉన్నత విద్యా దీపం, చంద్రన్న విదేశీ విద్యా దీవెనలు కూడా వైయస్ ఆర్ హయాంలో విజయవంతమైన రియంబర్స్ మెంట్ ఇంకా ఇతర పథకాల్లో భాగంగా జరిగినవే. 


ఇక చంద్రన్న బీమా అసంఘటిత కార్మికుల కోసం అని చెప్పినా ఇంత వరకూ అది ఎవ్వరికీ అందిన దాఖలాలు లేవు. ఇక చంద్రబాబుకు వీర విధేయతను ప్రదర్శించే కొందరు అధికారుల చొరవతో కుప్పం వ్యవసాయ మార్కెట్ యార్డుకు కూడా చంద్రబాబు పేరు తగిలించారు. 

ఇక గ్రామీణ చిల్లర వ్యాపారులను సర్వనాశనం చేసి, చౌక డిపోల లక్ష్యాలను తుంగలో తొక్కి, కార్పొరేట్లకు అప్పనంగా అప్పగించిన చౌకధరల దుకాణాలకు కూడా చంద్రన్న విలేజ్ మాల్స్ గా మారింది. 


ఇవన్నీ పరిశీలనగా చూస్తే చంద్రబాబుకు తన పేరును రాష్ట్రం అంతా మారుమోగేలా చేయాలన్న కోరిక బాగా ఉన్నట్టు అర్థం అవుతుంది. తన పేరు పెడితేనే ప్రతిష్ట వస్తుందనుకుంటే అది చంద్రబాబు భ్రమే. రాజశేఖర్ రెడ్డిని అందరూ తమ సొంతం చేసుకుని రాజన్నా అని పిలిచారు. బాబు మాత్రం తన పేరుకు అన్నను తగిలించేసుకుని చంద్రన్న అవతారం ఎత్తాడు. ఇది పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టే ఉందంటున్నారు పదే పదే ఆ మాట వింటున్న ప్రజలు. 


     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య