• YSRCP DMW, Vuyyuru Town

పోలవరానికి చంద్రగ్రహణం

నేటి అసెంబ్లీ సమావేశాలను చూస్తే అబద్ధాలన్నీ పోగేసుకుని ఒకేచోట మైకు ముందు కూచున్నాయనిపిస్తుంది. ఒక పక్క ప్రతిపక్ష నేత చంద్రబాబు అబద్ధాలను మండుటెండలోనూ ఎండగడుతుంటే, మరోపక్క ప్రభుత్వం కొత్త అబద్ధాలను అవలీలగా అల్లుకుంటూ పోతోంది. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు మొదలు పెట్టి ఆయనే పూర్తి చేస్తున్న చందంగా చర్చ సాగింది. అన్నిటికంటే హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే స్వయంగా చంద్రబాబు కేంద్రం ఈ ప్రాజెక్టు తనకు అప్పగించిందని చెప్పుకోవడం.  దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డిపై విమర్శలు చేయడంతో తమ కుత్సిత బుద్ధులను పచ్చపార్టీ నేతలు మరోసారి బైట పెట్టుకుంటూ అస్సలు పొంతనలేని అభియోగాలు చేసారు. చివరికి అప్పటి టెండర్ల రద్దుపై సైతం రాద్ధాంతం చేయాలని చంద్రబాబు  కుతంత్రాలు పన్నారు. ప్రతిపక్షం ప్రజలను రెచ్చగొడుతోందంటూ తమ అక్కసంతా వెళ్లగక్కుకున్నారు.

చంద్రబాబు ఇంకా ఆయనగారి భజన బృందాలకు అడ్డుచెప్పేవాళ్లు లేకపోవడంతో అసెంబ్లీని కాస్తా చంద్రబాబు కీర్తి సభగా మార్చేసారు తెలుగు తమ్ముళ్లు. పోలవరం పనుల్లో అవకతవకలపై గానీ, పునరావాసం కోసం తీసుకునే చర్యలుగానీ ఒక్కరూ ప్రస్తావించిందేలేదు. కేవలం బాబుని స్తుతించుకుంటూ తరించారు సభ్యులు. 


నిజాలేమిటి…?

ఎవరెంత గింజుకున్నా, పచ్చరంగు పూసి పతాక శీర్షికలకెక్కినా పోలవరం ప్రారంభించి, శరవేగంతో పనులు చేయించిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డికే చెందుతుంది. చంద్రబాబు చెబుతున్నట్టు రాష్ట్రాలతో ఉన్న సమస్యలు కేవలం ఇప్పటివే కాదు. రాజశేఖర్ రెడ్డిగారి హయాంలోనూ ఒరిస్సా, కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల నుండి ఒత్తిడులు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నించే ఆయన పోలవరం గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ముంపు గ్రామాల ప్రజలకు ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించడం, ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం, గిరిజనుల హక్కులు  వీటన్నిటి కోసం కలెక్టర్లు, ఇతర అధికారులతో అనేక  సదస్సులు ఏర్పాటు చేసి ఆప్రాంతంలో ఏకాభిప్రాయం సాధించారు. ముంపు  గ్రామాలకు కాలనీలు ఏర్పాటులోనూ సఫలీకృతులయ్యారు. 2006 ఏప్రిల్ సమయానికే 6 కాలనీల పనులు ప్రారంభించారు వైయస్సార్. పోలవరం కుడి, ఎడమ కాలువల పనులతో పాటు హెడ్ వర్క్స్ లో భాగంగా స్పిల్ వే, ట్విన్ టన్నెల్స్, కుడి, ఎడమ కనెక్టివిటీల నిర్మాణాలు వైయస్సార్ హయాంలోనే మొదలయ్యాయి. ఇక నిర్మాణ పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ పనులు మందకొడిగా చేస్తుండటంతో స్పిల్ వే, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం, పవర్ హౌస్ టెండర్లను వైయస్ రద్దు చేసారు. 


వైయస్ హయాంలోనే జరిగిన అధికశాతం పనులు

పోలవరం శరవేగంగా జరగడానికి చంద్రబాబే కారణం అంటూ  మాట్లాడుతున్న నేతలకు వైయస్సార్ పోలవరం ఆలోచన వచ్చింది మొదలు దాని పనులకున్న ఆటంకాలను తొలగించుకుంటూ, ఎంత వేగంగా పోలవరాన్ని ఆరంభించారన్న వాస్తవాన్ని మరిచిపోయినట్లు నటిస్తున్నారు. 2004లో పాడుబడ్డ పోలవరం శిలాఫలకానికి అభిషేకం చేసి రూ. 10151 కోట్ల వ్యయంతో పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పారు. వెంట వెంటనే 1,320కోట్లు, 1353కోట్లు విడుదల చేసారు. 2005లోనే స్థలం, పర్యావరణం క్లియరెన్సులు సాధించారు. 2007లో ఆర్ ఆర్, 2008లో వైల్డ్ లైఫ్ సాంచురీ మరియూ అటవీ శాఖ, 2009లో టెక్నికల్ ఎడ్వైజరీ కమిటీ, నేషనల్ వైల్డ్ లైఫ్ క్లియరెన్సులను సాధించిన ఘన వైయస్ఆర్ ప్రభుత్వానిది. ఏ క్లియరెన్సూ లేదంటూ ప్రతిపక్షంలో ఉన్న నాటి చంద్రబాబు విమర్శిస్తూనే ఉన్నారు. అయినా ప్రాజెక్టును పనిని పరుగులు పెట్టిస్తూనే ఈ క్లియరెన్సులన్నీ సాధించారు వెయస్సార్. 

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య