• YSRCP DMW, Vuyyuru Town

కంప్యూటర్ కనిపెట్టిన వాళ్లు .. డాక్యుమెంట్లు తేలేరా?


  • సవాల్‌ను స్వీకరించకుండా దిగజారుడు రాజకీయాలా

  • బాబు అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు ప్రచారం

  • మూడున్నర సంవత్సరాల్లో రూ.లక్షా 20 వేల అప్పు

  • దాంట్లో రూ.60 వేల కోట్లు పిచ్చిపిచ్చి ఖర్చులకే

  • ప్రజల కడుపుకొడుతున్న చంద్రబాబు కొంతైనా సిగ్గుందా

  • నీతి, పరిపాలన గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు

  • యనమలకు న్యూపేపర్‌కు, డ్యాక్యుమెంట్‌కు తేడా తెలియదా

  • రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదు

  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్యారడైజ్‌ పేపర్లపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించకుండా ఎందుకింత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఏపీ పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి టీడీపీని ప్రశ్నించారు. విదేశాల్లో తనకు ఒక్క రూపాయి ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నిరూపించలేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని వైయస్‌ జగన్‌ సవాలు విసిరారు. చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారంపై బుగ్గన విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇంతకు ముందు పనామా పేపర్లలో వైయస్‌ జగన్‌ పేరుందని టీడీపీ, వారి తోకపత్రికలు నానా అభండాలు వేశారని, వాస్తవంలోకి వస్తే హెరిటేజ్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌ పేరు ఉందన్నారు. దీనిపై టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. కంప్యూటర్‌ను మేమే కనిపెట్టామని చెప్పుకునే చంద్రబాబు ప్యారడైజ్‌ పేర్లు తెప్పించాలని చాలెంజ్‌ విసిరారు. పేపర్‌లలో వచ్చే న్యూస్‌ను బట్టి మాట్లాడడం ఎందుకు అసలు పేపర్లనే తెప్పించాలని ధ్వజమెత్తారు. ఏపీలో జరిగిన అవినీతి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా జరిగివుండదని బుగ్గన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి తప్పుడు ప్రచారాలకు తెరలేపారన్నారు. 


చంద్రబాబు మూడున్నర సంవత్సరాలుగా ఈ నెలను కలుపుకొని రూ. లక్షా 20 వేల అప్పు చేశారని కాగ్‌ నివేదిక పేర్కొందని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. అంటే ఒక్కొక్క వ్యక్తిపై ఎంత పెంచుతున్నారని బుగ్గన ప్రశ్నించారు. దాంట్లో రూ. 60 వేల కోట్లు చంద్రబాబు ఆయన కోటరీ పిచ్చిపిచ్చి ఖర్చులకే వాడారన్నారని, దీనిపై ఆర్థిక మంత్రి యనమల ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. విదేశాలకు తిరగడం, భవనాలకు హంగులు దిద్దుకోవడం.. ఫారెన్‌ ఎఫైర్‌ మినిస్టర్‌ తిరగనంతగా టీడీపీ మంత్రులు తిరిగారన్నారు. వీటన్నింటిపై మీరు మాట్లాడరు కానీ ప్యారడైజ్‌ పేపర్లు, పనామా పేపర్లు అంటూ తప్పుడు ప్రచారాన్ని తీసుకొస్తారని మండిపడ్డారు. 


కోట్లాది మంది కడుపు కొడుతూ వారికి ఇబ్బందులు కలిగించే పాలన చేస్తున్న చంద్రబాబుకు కొంతైనా సిగ్గుందా అని బుగ్గన ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును ముడుపుల కోసం తీసుకొని ఇప్పుడు బాబు తన పత్రికల ద్వారా పోలవరం ఇక లేనట్లే అంటూ ప్రజలను మెల్లగా మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కేంద్రం కట్టే ప్రాజెక్టును మీరెందుకు తీసుకున్నారు. ముడుపుల కోసం కాదా.. కాంట్రాక్టర్‌ ద్వారా ముడుపులు తీసుకొని ఇప్పుడు అంచెనాలు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నది వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రత్యేక హోదా అంటే ఆ రోజున ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. హోదా అనేది కేంద్రం ఇచ్చిన హామీ అంటే ప్యాకేజీ మేలు అన్నారు. ఇప్పుడు పోలవరం లేదు. ప్రత్యేక హోదా లేదు. బాబు అంగీకరించిన ప్యాకేజీ కూడా లేదని బుగ్గన విరుచుకుపడ్డారు.


నీతి, అవినీతిల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు, ఆయన మంత్రులకు లేదని బుగ్గన మండిపడ్డారు. 2014లో గవర్నర్‌ తిరస్కరించిన అంశాన్ని చట్టం చేసి జీఓ 22 విడుదల చేసి పని జరుగుతున్న ప్రాజెక్టులకు రెండింతలు రేట్లు పెంచి కాంట్రాక్టర్లకు ముడుపులు చెల్లించారన్నారు. తాత్కాలిక భవనాలు, తాత్కాలిక పట్టిసీమ, ఇసుక, కాల్‌మనీ సెక్స్‌రాకెట్, సదావర్తి చివరకు దేవుడిని కూడా వదలకుండా ముడుపులు తీసుకున్నారన్నారు. పుష్కరాల పేరుతో రూ. 3 వేల కోట్లు ఖర్చు చేశారని, చంద్రబాబు కట్టిన మెట్లు అయినా అక్కడ కనిపించడం లేదన్నారు. ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాద్‌ను విడిచిపెట్టి లింగమనేని అక్రమకట్టడంలో నివాసం ఉంటున్నారని, దానికి ప్రభుత్వ సంపదతో హంగులు దిద్దుకున్నారన్నారు. 


రాజకీయాల్లో చాలా అనుభవం ఉందన్న ఆర్థిక మంత్రి యనమలకు న్యూస్‌ పేపర్‌ క్లిప్పింగ్‌కు.. డాక్యుమెంట్‌కు తేడా తెలియదా అని బుగ్గన ఎద్దేవా చేశారు. కంప్యూటర్‌నే కనిపెట్టిన వారు ప్యారడైజ్‌ డ్యాక్యుమెంట్‌లను ఎందుకు తెప్పించలేకపోయారన్నారు. వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు చిరంజీవి, అక్కినేని నాగార్జునకు కూడా వ్యాపారాలున్నాయన్నారు. మరి వారి గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు. వైయస్‌ జగన్‌ ప్రజాధరణ చూసి భయం కాబట్టి ఆయన గురించి మాట్లాడుతున్నారన్నారు. 


మీ సొంత పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక శాఖామంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. దాదాపు రూ. 2 వేల కోట్ల పనులను యనమల అల్లుడు, పరిటాల కుటుంబీకులు తెలంగాణలో కాంట్రాక్టులు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. పక్క రాష్ట్రంలో కాంట్రాక్టులు చేసుకుంటూ ఏపీని నాశనం చేస్తున్నారని, ఇలాంటి వ్యక్తులు పాలన, పద్దతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 

ఒకరితో పొత్తుపొట్టుకోకుండా 2014 ఎన్నికల్లో 44.4 శాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ అని, టీడీపీ మోడీ కాళ్లు పట్టుకొని, పవన్‌ కల్యాన్‌తో కలిసి, లేనిపోని హామీలన్నీ చెప్పి కేవలం 1 శాతంతో నెగ్గిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌  పాదయాత్ర చేసేది తప్పులు కప్పిపుచ్చుకోవడానికని యనమల మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మరి చంద్రబాబు ఎందుకు పాదయాత్ర చేసినట్లు అని నిలదీశారు. చంద్రబాబు, ఆయన మంత్రులు మొదట వారిపై సీబీఐ, ఈడీ, సీబీడీటీ, ఎస్‌ఎఫ్‌ఐతో ఎంక్వైరీ వేయించుకోవాలని, తరువాత వైయస్‌ జగన్‌పై ఎంక్వైరీ వేయాలని సూచించారు. మీ కేంద్రమంత్రి సుజనా చౌదరి 100 కోట్ల స్కాం చేశారని, వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ కాంట్రాక్టర్‌ను బెదిరించారని, చింతమనేని ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేస్తే మీరేం యాక్షన్‌ తీసుకున్నారని బుగ్గన విరుచుకుపడ్డారు. ఇదేనా మీ పరిపాలన అంటూ యనమలను ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ఎందుకు లేదు.. 21 మంది ఫిరాయింపుదారులను పెట్టుకొని వారిలో నలుగురిని మంత్రులుగా పేర్కొంటూ అసెంబ్లీ బుల్‌టెన్‌ విడుదల చేశారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలనే సమావేశాలను బహిస్కరించామన్నారు. స్పీకర్‌ యాక్షన్‌ తీసుకుంటే ఫిరాయింపుల వ్యవహారం కోర్టుకు ఎందుకు వెళ్తుందన్నారు. 


     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య