• YSRCP DMW, Vuyyuru Town

కబ్జాలతో వణికి పోతున్న రాజధాని


– ఎడాపెడా భూములను దోచేస్తున్న చంద్రబాబు సర్కార్

– ఆలయ భూములను అప్పనంగా రాసిస్తున్న వైనం

– అమరావతి శంకుస్థాపనతో దోపిడీకి శ్రీకారం చుట్టిన బాబు 

– తాజాగా కృష్ణా నదీ తీరాన మరో 50 ఎకరాలకు టెండర్‌


ఏ ముహూర్తాన చంద్రబాబు సీఎం అయ్యాడోకానీ... అప్పట్నుంచే చంద్రబాబు ఫోకస్‌ విజయవాడ మీద పడినట్టుంది. ముఖ్యమంత్రిగా గెలిచిన మూడేళ్ల కాలంలో ఆయన నోట విజయవాడ తప్ప మరో మాట వినిపించడంలేదు. గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో అమరావతిలో రాజధాని నిర్మాణం ప్రకటించడం మొదలుకుని రాష్ట్రమంతా ముఖ్యమంత్రి భూముల దోడిపీకి తెరతీశారు. దసరా పండుగన రోజున ప్రధానిని పిలిపించి చేసిన భూమి పూజతో అసలు కథ మొదలైంది. అప్పుడెవరికీ తెలియదు.. చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకోవడం వెనుక అసలు కథ. శివరామకృష్ణన్‌ కమిటీ దొనకొండ ప్రాంతం అన్ని విధాలా అనుకూలమని తేల్చినా చంద్రబాబు అమరావతివైపే మొగ్గు చూపారు. 


అమరావతి నిర్మాణం మొదలుకొని...

అంతర్జాతీయ రాజధానిని నిర్మిస్తున్నామంటూ ఒక్కరోజు భూమి పూజకు రూ. 400 కోట్లు ఖర్చు చేసి.. ప్రధానిని పిలిచి పేపర్ల నిండా వార్తలు రాయించుకున్నాడు. అదే మొదలు ఇప్పటికీ ఆ శంకుస్థాపన జరిగిన ప్రాంతం సమాధిలా వెక్కిరిస్తూనే ఉంది. అంతకు ఒక్క అడుగూ ముందుకు కదల్లేదు. రెండు మూడు షెడ్లు తప్ప రాజధాని ఊసే లేదు. కానీ రాజధాని నిర్మాణం పేరు చెప్పి చుట్టుపక్కల రైతుల భూములను లాక్కుని సింగపూర్‌ కంపెనీకి అప్పగించారు. దాదాపు 33 వేల ఎకరాల భూములను రైతుల నుంచి లాక్కున్నారు. ఈ భూముల వ్యవహారంలో జరిగిన కుంభకోణం.. భూములు పంచుకున్న తెలుగుదేశం నాయకులు, మంత్రుల బాగోతం బట్టబయలైంది. కోర్టులు కూడా వద్దన్న స్విస్‌ ఛాలంజ్‌ విధానాన్నే చంద్రబాబు కొనసాగించడం చూస్తేనే కుట్ర కోణం ఉన్న సంగతి తెలుస్తుంది.  


అమరావతి దందాపై ఐవైఆర్‌ ఫైర్‌

అప్పట్లో సీఎస్‌గా వ్యవహరించిన ఐవైఆర్‌ కృష్ణారావు అమరావతి దారుణాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బయటి వాళ్లు చెప్పిన మాటల్ని విమర్శలుగా కొట్టిపారేయచ్చుగానీ ఆయన చెప్పిన విషయాల్ని తక్కువ చేయలేం. అమరావతికి సంబంధించి ప్రతి నిర్ణయం వెనుక ఆయన ప్రత్యక్ష సాక్షి. అమరావతి రాజధాని ఓ పెద్ద రియల్‌ ఎస్టేట్‌ వెంచరేనని, ఇది అందమైన బ్రోచర్లు, ఊహల రాజధానేనని, వాస్తవ విరుద్ధ చర్యలతో ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేస్తోందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్‌.కృష్ణారావు అన్నారు. ప్రపంచంలోనే ఇది తొలి అవుట్‌సోర్సింగ్‌ రాజధాని కానుందని వ్యాఖ్యానించారు. వేల ఎకరాలు భూమిని ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఒకే ప్రాంతంలో సమీకరణ, సేకరణ రెండూ చేపట్టడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. వందేళ్ల క్రితం రికార్డు చూపెట్టి మోసం చేశారన్నారు. ప్రస్తుతం 38 వేల ఎకరాలు చెబుతున్నా 2050 నాటికి లక్ష ఎకరాలు తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారని పేర్కొన్నారు. ఇదో పెద్ద రియల్‌ ఎస్టేట్‌ వెంచరన్నారు. 


బందర్‌ పోర్టు కోసం లక్ష ఎకరాలు

బందర్‌ పోర్టు నిర్మాణం కోసం చంద్రబాబు దాదాపు లక్షా 5 వేల ఎకరాలు లాక్కునేందుకు పథక రచన చేశారు. ప్రతిపక్షంలో ఉండగా పోర్టు నిర్మాణానికి 4800 ఎకరాలు చాలని తేల్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతుల భూములపై ఆశపుట్టి అప్పనంగా తన వారికి కట్టబెట్టేందుకు మాయోపాయాలు సిద్ధం చేశారు. 5వేల ఎకరాలు, 22వేలు, 35వేల ఎకరాలు అని చెప్పుకుంటూ వచ్చి చివరగా పోర్టు నిర్మాణానికి ఏకంగా లక్షా 5 వేల ఎకరాలు సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చారు. 


రూ. 50 కోట్లు విలువ చేసే బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ భూములు 

దాదాపు మూడు దశాబ్దాలుగా బుక్‌ ఫెస్టివల్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న మైదానంపై నారా లోకేష్‌ కన్నేశాడు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ ఆధ్వర్యంలో నవ్యాంధ్ర పుస్తక సంబరాల పేరిట బుక్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తామని చెప్పి విజయవాడ నడిబొడ్డులో ఉన్న దాదాపు రూ. 50 కోట్ల విలువైన భూములకు టెండర్‌ పెట్టేశాడు. 


సిద్దార్థ కాలేజీకి దుర్గమ్మ భూములు 

విజయవాడలో దుర్గమ్మ భూములను సిద్దార్థ మెడికల్‌ కాలేజ్‌కు తక్కువ ధరకే లీజుకు ఇచ్చారు. ఎకరం 70 కోట్ల విలువ చేసే భూమిని అతి తక్కువ ధరకే నిబంధనలకు విరుద్దంగా కట్టబెట్టారని ఆరోపించారు. భూమి విలువలో కనీసం 10 శాతం సొమ్మును లీజు కింద వసూలు చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. ఆ లెక్కన ఎకరం 70 కోట్ల విలువైన భూములను లీజుకు ఇస్తే ఎకరానికి 7 కోట్ల రూపాయలను లీజు కింద వసూలు చేయాల్సి ఉంటుంది. అవేమీ సర్కారుకు పట్టలేదు. గజం లక్షన్నర విలువ చేసే దుర్గమ్మ భూములను కేవలం ఎకరా లక్షన్నరకే 33 ఏళ్ల పాటు లీజుకిచ్చేశారు. 


కృష్ణా నది ఒడ్డున 50 ఎకరాల స్వాహా..

కృష్ణా జిల్లాలో కృష్ణా నది ఒడ్డునే ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే దేవాదాయ భూమిని తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రికి కట్టబెట్టేందుకు అంతా సిద్ధం చేశారు. జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామంలోని భవానీ ముక్తేశ్వరస్వామి వారి దేవస్థానానికి చెందిన 50.31 ఎకరాల భూమిని సుదీర్ఘ కాలం పాటు లీజు పద్ధతిన ఆ నేతకు కట్టబెట్టబోతున్నారు. భవానీ ముక్తేశ్వరస్వామి వారి దేవస్థానానికి  ముక్త్యాల.. ఆ చుట్టు పక్కల గ్రామాల్లో మొత్తం 170 ఎకరాల వ్యవసాయ భూములున్నట్టు దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికి పర్యాటక రంగం(టూరిజం) అభివృద్ధి పేరుతో ఈ భూమిని ధారాదత్తం చేయబోతున్నారు. ఎకరా రూ.20 వేల చొప్పున 50.31 ఎకరాలకు ఏడాదికి పది లక్షల లీజు ధరతో మొత్తం భూమి 33 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గడువు ముగిసిన తర్వాత లీజు ఒప్పందం పొడిగించేందుకు అనుమతి ఇవ్వాలనే నిబంధన  చేర్చారని తెలిసింది. ఈ భూమికి పక్కనే సంబంధిత మాజీ మంత్రికి దాదాపు 200 ఎకరాల భూములున్నట్టు స్థానికులు చెబుతున్నారు

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య