• YSRCP DMW, Vuyyuru Town

జలసిరి అంతా కిరికిరి


నదులకు హారతులివ్వడం ఒక సంప్రదాయం. కాని అది కటువైన నిజాలను దాచేసే ఒక ప్రచార వ్యూహం అని తేలితేనే బాధ కలుగుతుంది. చంద్రబాబు చేపట్టిన జలసిరి, జల హారతి కార్యక్రమాలు చూస్తే రైతుల గుండె నిజంగా మండుతుంది. లక్షలాది ఎకరాల పంటభూములు సాగునీటి కోసం ఎదురుచూస్తుంటే, ఆర్భాట కార్యక్రమాలు తప్ప అసలు పని జరగడం లేదని వ్యవసాయదారులు వాపోతున్నారు. సన్న, చిన్నకారు రైతుల పొలాల్లో బోర్లు తవ్వించి ఆభూములకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన జలసిరి 1 ఆరంభ శూరత్వమే అని నిరూపణ అయ్యింది. లక్షలు, కోట్లు ఖర్చు చేసి వేయించిన బోర్లకు కరెంటు కనెక్షన్లు ఇవ్వకుండా జలసిరి ఆహా ఓహో అని జబ్బలు చరుచుకుంది టిడిపి సర్కార్. 


ఎన్టీఆర్ జలసిరి కిరికిరి:

ఒకప్పటి జలప్రభ పథకానికే పేరు మార్చిఎన్టీఆర్ జలసిరి పేరుతో చంద్రబాబు శ్రీకారం చుట్టారు. 12జిల్లాల్లో దాదాపు లక్షా పాతికవేల బోర్లను ఆయా జిల్లాలకు కేటాయించారు. చిత్రంగా అన్ని జిల్లాలకంటే తక్కువగా 285 బోర్లు కడపకు కేటాయించారు. మిగిలిన జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 15వేలకు పైగా బోర్లను శాంక్షన్ చేసారు. ఈ పథకంలో ఒక యూనిట్ కు లక్షపైగానే ఖర్చునిర్థారించారు. అయితే ఐదు ఎకరాల్లోపు ఉండే రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇంకా అనేక కొర్రీలతో ఈ పథకం లబ్దిదారులకు సరిగ్గా అందనేలేదు. చివరకు ఎన్ టి ఆర్ జలసిరి పథకాన్ని అన్నిప్రాంతాలకూ కాకుండా రిజర్వాయర్లు, కాల్వలు, చెరువుల కింద ఆయకట్టుగా ఉండి సక్రమంగా నీరు అందని ప్రాంతాలకు పరిమితం చేశారు. కాని ఆ పరిమితిలో ఉన్న లబ్దిదారులకు కూడా జలసిరి బోర్లు వేయించడంతోటే సరి అని సరిపుచ్చుకోమంది. లక్షలాదిగా దరఖాస్తులు రాగా సగం కూడా కేటాయింపులు జరగలేదు. తూతూ మంత్రంగా జలసిరి-1 పూర్తైపోయింది. 


తర్వాత మొదలెట్టిన జలసిరి పార్టు- 2 కూడా ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కులా సాగింది. ఈ సారి యూనిట్ విలువ ఐదులక్షలు దాటిపోయింది. 10,000కు పైగా బోర్లు మంజూరైతే వర్షాకాలం వచ్చే వరకూ బోర్ల తవ్వకాలు పావు వంతు కూడా పూర్తి కాలేదు. ఆయకట్టు చివరి భూములకే ప్రాధాన్యం ఇచ్చినా, ఆయాప్రాంతాల్లో నీటి లభ్యత లేకపోవడం, కొన్ని అడుగుల లోతు వరకే అనే నిబంధనతో జలసిరి అనుకున్న లక్ష్యాన్ని చేరనేలేదు. క్షేత్రస్థాయిలోని సవాలక్ష ఇబ్బందులతో రైతులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. లబ్దిదారులను జన్మభూమి కమిటీ ఆమోదించాలనే నిబంధన ఉండనే ఉంది. అంటే టిడిపి నేతల కనుసన్నల్లో జరిగే ఈ కమిటీల్లో లబ్దిదారులెవరన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 


విద్యుత్ సరఫరా లేక, విద్యుత్ కు ప్రత్యామ్నాయంగా ఇచ్చిన సౌరశక్తి సెట్లు పని చేయక, లబ్దిదారుల భాగస్వామ్యంపై స్పష్టత ఇవ్వక ఈ పథకం యథావిధిగా ప్రయోజనం లేనిదే అయ్యింది. జలసిరి అంటూ చంద్రబాబు చేసిన ఆర్భాటం అంతా ప్రకటనలకు, ప్రచారాలకే తప్ప రైతులకు ఒరిగింది, జలసిరి కలిగిందీ ఏమీ లేకుండా పోయింది. పనులు పూర్తికాకుండానే పురుషోత్తం పట్నం ఎత్తిపోతలను జాతికి అంకితమిచ్చేసారు చంద్రబాబు. వంశధార స్టేజ్ 2 పనులు మందకొడిన సాగుతున్నాయి. పోగొండ, ఎర్రకాలువ ఆధునీకరణ కూడా నత్తనడకనే. ఇక పోలవరం సంగతి నిత్యం చూస్తున్న తమాషానే. పెదపాలెం, కండలేరు, గోరుకల్లు, అవుకు కూడా ఎప్పుడు పూర్తి అవుతాయో తెలీని దుస్థితి. పేరుకు పాతిక ఇరిగేషన్ ప్రాజెక్టుల ప ఏర్లు వల్లె వేస్తున్న చంద్రబాబు వాటిని పూర్తి చేసే చిత్తశుద్ధితో ఉన్నాడా అంటే అందుకు సమాధానం ఆ తీరుబడిగా సాగుతున్న ఆ పనులే చెబుతాయి. ఇక వైయస్సార్ హయాంలో ఆరంభించిన సాగు,తాగు నీటి ప్రాజెక్టులను వీలైనంత జాప్యం చేయడం, లేదా వాటి క్రెడిట్ ను తన అక్కౌంట్ లోకి వేసుకోవడానికి ప్రయత్నం చేయడం చూస్తుంటే చంద్రబాబుకు పేరు పరపతి మీద వ్యామోహం తప్ప ప్రజల కోసం ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యం లేదని అర్థం అవుతుంది. ఇప్పుడు నదులకు, రిజర్వాయర్లకు, డ్యామ్ లకు హారతులిస్తున్న చంద్రబాబును చూస్తే సన్నాయి నొక్కులే గాని సంగీతం లేదు అన్నట్టనిపిస్తుంది. 

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య