• YSRCP DMW, Vuyyuru Town

చిత్తశుద్ధి ఉంటే సీమకు నీరివ్వండి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి


ఉరవకొండ: ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాయలసీమకు నీరివ్వాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జీవో నంబరు 65ను మార్చి శ్రీశైలం నుంచి సీమకు నీరిచ్చి సస్యశ్యామలం చేయాలని చంద్రబాబును కోరనున్నట్లు ఆయన తెలిపారు. జలహరతీ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 8న ఉరవకొండకు వస్తున్న చంద్రబాబుకు విశ్వేశ్వర్‌రెడ్డి పలు సూచనలు చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఉరవకొండలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. జలహారతులు సాధారణంగా పుష్కరాల సందర్భంగా చూశాం, ఈ ఏడాది శ్రీశైలం డ్యామ్‌లో ఏమాత్రం నీళ్లు లేకపోయినా..తుంగభద్ర డ్యాంలో పరిమితంగా నీళ్లు ఉన్నా..ప్రభుత్వం అట్టహాసంగా జలహారతి కార్యక్రమం నిర్వహిస్తుంది. జలహారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉరవకొండకు వస్తున్న చంద్రబాబు ఈ సారైనా సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. హంద్రీనీవాకు చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందే గత ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేశాయి. హంద్రీనీవా మొదటి దశలోనే 95 శాతం పనులు పూర్తయ్యాయి. రెండో దశలో కూడా 75 శాతం పనులు బాబు అధికారంలోకి వచ్చే నాటికి పూర్తయ్యాయి. గత ఐదు సంవత్సరాలుగా నీళ్లు వస్తున్నాయి. హంద్రీనీవా కింద 3.5 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని వాస్తవ ప్రతిపాదనలు ఉన్నాయి. డీపీఆర్‌ నివేదికలోనూ ఇవే ఉన్నాయి. మొదటి దశలో రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉంటే కనీసం 10 వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. మూడేళ్లుగా మేం మొదటి దశ కింద ఉన్న ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని అనేక రూపాల్లో పోరాటం చేశాం. అయితే ఈ రోజు వరకు కూడా డిస్ట్రిబ్యూషన్‌ కాల్వలు పూర్తి చేసి నీళ్లు ఇచ్చే పని ప్రభుత్వం చేయలేదు. నేను ఈ విషయంపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఆయకట్టుకు నీరిస్తామని  ప్రభుత్వం 2016 ఆగస్టులో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఏడాది పూర్తయినా ఎక్కడా కూడా ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. రైతులు అనధికారికంగా లక్షలు ఖర్చు చేసుకొని మోటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు తప్ప..ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దాదాపు రూ.350 కోట్లు కరెంటు బిల్లుల రూపంలో చెల్లించారు. రైతులు కనీసం రూ.3 కోట్ల పంటలు కూడా పండించలేదు. ఈ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు.  


ప్రచార ఆర్భాటమే :

ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనిలో కూడా ప్రచార ఆర్భాటమే అని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. అనేక లిప్టులు, అనేక ప్రాజెక్టులు కలిగిన భిన్నమైన హంద్రీనీవాను ఈ ప్రభుత్వం ఒక్కొ బ్రాంచ్‌ కాల్వ కడితే ఒక్కో రకంగా ప్రచారం చేసుకుంటుంది. ఇవన్నీ కూడా హంద్రీనీవాలో భాగమే అయినా కూడా   ఎన్ని ప్రాజెక్టులు కడుతున్నామో? ఎంత సస్యశ్యామలం చేస్తున్నామో అన్న రీతిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇన్ని నీళ్లు వచ్చినా కూడా జిల్లాలో భూగర్భ జలాలు పెరిగింది లేదు. వలసలు ఆగడం లేదు. 


ఆయకట్టుకు నీరివ్వండి:

హంద్రీనీవా ద్వారా ఆయకట్టుకు నీరివ్వాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. 27 వేల హెక్టార్లకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీరిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే తవ్విన డిస్ట్రిబ్యూటర్స్, కాల్వలను ఏం చేయబోతున్నారు. ఈ ఆయకట్టును రద్దు చేయబోతున్నారా? ఈ కాల్వలను పూడ్చేయదలుచుకున్నారా?. ఇంత పోరాటం చేస్తున్నా.. 33, 34వ ప్యాకేజీ పనులన్ని ఆగిపోయాయి. కాల్వ వెడల్పు చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. గతంలో చంద్రబాబు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీనీవాకు సంబంధించి ఒక్క కాల్వ కూడా తవ్వలేదు. హంద్రీనీవాను 40 టీఎంసీలను 5.5 టీఎంసీలకు కుదిస్తూ జీవో ఇచ్చారు.  ఒక్క కిలోమీటర్‌ కూడా తవ్వలేదు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో హంద్రీనీవా పనులు పూర్తి చేయాలని కోరుతున్నాం. శ్రీశైలం రిజర్వాయర్‌లో వంద టీఎంసీల నీటిని నిల్వ చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. శ్రీశైలంలో 875 నీటిమట్టం ఉంటేనే 100 టీఎంసీలు నిల్వ చేయవచ్చు. 1996లో జీవో నంబరు 65 తీసుకొనివచ్చి 834 అడుగుల నీటి మట్టానికే దిగువకు నీళ్లు ఇచ్చే విధంగా చట్టం చేశారు. 800 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు ఆ జీవోను మార్చాలి. పులిచింతల పూర్తి అయ్యింది. పట్టిసీమ నుంచి కృష్ణా yð ల్టాకు నీరిస్తామంటున్నారు. రాయలసీమకు ఎందుకు ఇవ్వడం లేదు. సీమ ప్రాజెక్టులకు నికరజలాలు కేటాయిస్తామని చంద్రబాబు ఒక్క మాట చెప్పాలి.  బ్రిజేస్‌ ట్రిబ్యూనల్‌ తీర్పు తరువాత హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు మిగుల జలాలు లేవు. అధికారికంగా నీటి కేటాయింపులు చేపట్టాలని చంద్రబాబును కోరుతున్నాను. శ్రీశైలంలో నీటిని నిల్వ ఉంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీరివ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. రాయలసీమ దుర్భర పరిస్థితిని మార్చాలని కోరుతున్నాం.

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య