• YSRCP DMW, Vuyyuru Town

ఆత్మస్తుతి.. పరనింద


– టీడీపీ బహిరంగ సభగా మార్చేసిన చంద్రబాబు

– చప్పగా సాగిన అసెంబ్లీ సమావేశాలు

– ప్రతిపక్షం గైర్హాజరుతో పసలేని ప్రసంగాలు


అసెంబ్లీ సమావేశాలను కూడా టీడీపీ బహిరంగ సభల్లాగా మార్చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతిలో ప్రారంభమైన శీతాకాల అసెంబ్లీ సమావేశాల తొలిరోజు మొత్తం గొప్పలు చెప్పుకోవడంతోనే సరిపోయింది. ప్రజా సమస్యలు పక్కనపెట్టి అప్పుడది చేశాం.. జగన్‌ అలాంటి వాడు అని ఆత్మస్తుతి.. పరస్తుతితోనే గడిచిపోయాయి. ఇన్నాళ్లు సభ సజావుగా జరగకపోవడానికి ప్రతిపక్షమే కారణమంటూ నిందలు మోపి సంబరపడిన టీడీపీ నాయకులు.. వైయస్‌ఆర్‌సీపీ సభలను బహిష్కరిస్తే ఎలా ఉంటుందో సభ జరిగిన తీరే నిదర్శనం. టీడీపీ నిర్వాకం చూస్తే ప్రజలు ముక్కున వేలేసుకునే పరిస్థితి నెలకొంది.


ప్రభుత్వ తీరుతో సమావేశాల బహిష్కరణ

ప్రభుత్వ ఆప్రజాస్వామిక తీరును నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్ష వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హాజరుకాని నేపథ్యంలో.. శుక్రవారం నుంచి ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలిరోజు కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనేదీ లేకుండానే ముగిసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ చేయాలని.. యువతకు ఉద్యోగ–ఉపాధి అవకాశాలు కల్పించాలని, పార్టీ ఫిరాయించిన వారిని తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.


వీటిని నెరవేర్చడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించి పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లింది. సమస్యలను పరిష్కరించి ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వం వాటిని విస్మరించి ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించింది. సమావేశాల తొలి రోజున ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలుకొని చివరి వరకు ప్రభుత్వానికి వత్తాసుగానే తప్ప ప్రజలకు మేలు చేసే ఏ విధమైన చర్చ లేకుండాపోయింది. అనేక అక్రమాలకు ఆలవాలంగా మారి దాదాపు రూ.353 కోట్ల మేర అవినీతి జరిగిందని సాక్షాత్తూ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తప్పుబట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై వచ్చిన ప్రశ్నను స్వల్పకాలిక చర్చగా మార్చి ప్రభుత్వానికి కితాబులిచ్చే దిశగా ప్రసంగాలు కొనసాగాయి.  


ప్రజా సమస్యల ప్రస్తావనే లేదు

ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో శుక్రవారం ప్రారంభమైన సభ.. ప్రభుత్వానికి, అధినేత చంద్రబాబునాయుడికి జేజేలు పలకడమే తప్ప ఏ సమయంలోనూ ప్రజాసమస్యల ప్రస్తావన కనిపించలేదు. మొదటి ప్రశ్నగా  పట్టిసీమ ప్రాజెక్టుపై దాదాపు అరగంటసేపు చర్చ సాగించారు. ఈ పథకంలో జరిగిన అవినీతి అక్రమాల సంగతిని ప్రస్తావనకు లేకుండా కేవలం నదుల అనుసంధానం చేసిన అపర భగీరధుడిగా చంద్రబాబును కీర్తించే చర్చగా మార్చేశారు. ఇటీవల కార్పొరేట్‌ కళాశాల్లో ప్రధానంగా నారాయణ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కవయ్యాయి. 50 రోజుల వ్యవధిలోనే దాదాపు 60 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇంత తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నా ఏ ఒక్కరూ దానిపై పెదవి విప్పకపోవడం దారుణం. 

     Maintained by YSRCP Digital Media Wing,Vuyyuru Town. © 2016.The contents are owned by YSRCP Vuyyuru Town

  వీక్షకుల సంఖ్య