వై.యస్.ఆర్ రైతు భరోసా


రైతన్నలకు పెట్టుబడి సాయం అందించాలనే గొప్ప ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గారు ‘వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్‌’ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ప్రతి రైతుకు ఏడాదికి రూ. 13,500/- చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 49 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూపొందించబడిన ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు..


  • రైతు భరోసా కింద ఎంత డబ్బు అన్నదాతలకు అందుతుంది?

వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రధాని కిసాన్ పథకం నగదు రూ. 6 వేలుతో కలిపి విడతల వారీగా రూ.13,500/- నగదును రైతులకు అందజేస్తారు. తొలుత మేనిఫెస్టోలో రైతులకు రూ. 12,000/- పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం సైతం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఏడాదికి రూ. 6 వేల పెట్టుబడి సాయం ప్రకటించింది. ఇది కూడా కలిసి రావడంతో వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 13,500/- ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు.


మొదటి విడత: ప్రతి ఏటా మే నెలలో రూ. 7,500 (పీఎం కిసాన్ రూ. 2,000 కలిపి)

రెండో విడత: ప్రతి ఏటా అక్టోబర్‌లో రూ. 4,000 (పీఎం కిసాన్ రూ. 2,000 కలిపి)

మూడో విడత: ప్రతి ఏటా జనవరిలో రూ.2,000 (పీఎం కిసాన్ ఇస్తుంది)

  • రైతు భరోసాకు అర్హతలు ఏంటి?

ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి విధివిధానాలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రతి రైతు కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపజేసింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు వర్తిస్తుంది. ఉద్యాన పంటలు, పట్టు పరిశ్రమకూ రైతు భరోసా పథకం వర్తిస్తుంది. ఉద్యాన పంటలు కనీసం ఎకరం భూమి సాగులో ఉండాలి. కూరగాయలు, పువ్వులు, పశువుల మేత కోసం కనీసం అర ఎకరం భూమి సాగు చేస్తుండాలి. ఒకే యజమానికి ఒకరికి మించి కౌలుదారులుంటే ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుంది. ఒకరికి మించి కౌలుదారులుంటే ఎస్టీలకు ప్రాధాన్యం. ఆ తర్వాతి వరుస క్రమంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలు. వ్యవస్థీకృత భూ యజమానులకు పథకం వర్తించదు. ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలకు ఈ పథకం వర్తించదు. జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులకు వర్తించదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయాన్ని బట్టి పథకం వర్తింపు.

  • రైతు భరోసాకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

గ్రామ, వార్డు వలంటీర్లకు రైతు పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను ఇవ్వాలి. వాళ్లే గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్లయ్ చేస్తారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు వలంటీర్లను అప్రమత్తం చేస్తుండాలి.

  • రైతు భరోసా డబ్బు జమ చేశారో లేదో ఎలా చెక్ చేసుకోవాలి?

రైతులు తమ అకౌంట్లలో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకునే అవకాశాన్ని జగన్ సర్కార్ కల్పించింది. వైఎస్సార్ రైతు భరోసా వెబ్‌సైట్‌ (https://ysrrythubharosa.ap.gov.in/) లోకి వెళ్ళి.. ఆ తర్వాత అక్కడ కనిపించే నో యువర్ రైతుభరోసా స్టేటస్ (Know your RythuBharosa Status) మీద క్లిక్ చేయాలి. అక్కడ సంబంధిత రైతు ఆధార్ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేస్తే డబ్బులు అకౌంట్‌లో జమయ్యాయో లేదో తెలుసుకోవచ్చు.

  • ఒకవేళ రైతు భరోసా జమ కాకపోయినా, అర్హత జాబితాలో పేరు లేకపోయినా ఏం చేయాలి?

రైతు భరోసాకు సంబంధించి బ్యాంకులు నుంచి ఇబ్బందులు ఎదురైతే.. 1902 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. సీఎం క్యాంప్ ఆఫీసులోనే ఈ నంబర్ ఉంటుంది. లేక గ్రామ, వార్డు వలంటీర్‌నైనా సంప్రదించవచ్చు.

248 views0 comments

Recent Posts

See All